Pages

Tuesday, May 24, 2011

జగన్, విజయమ్మల ప్రమాణం నిలుపుదలకు హైకోర్టు నో

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయలక్ష్మిలు ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో పొందుపరచనందున వారిని లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా ప్రమాణం చేయకుండా నిరోధించాలన్న ఓ పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తుల వివరాలు వెల్లడించలేదంటూ విచారణ జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ విషయంలోమధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని కూడా తేల్చి చెప్పింది. 

హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పి.సత్యనారాయణ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆస్తుల వివరాలను పరిశీలించేందుకు ఓ స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేటట్లు కూడా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అసలు ఈ వేసవి సెలవుల్లో ఈ వ్యాజ్యాన్ని అంత అత్యవసరంగా దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

No comments:

Post a Comment