Pages

Wednesday, May 25, 2011

విజయనగరం news

సీతారాముల సేవలో జగన్
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన రామతీర్థంలోని శ్రీసీతారామస్వామిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ గల బేడాలో ఆయన ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పది మంది అర్చకులు జననేత పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పాదాలచెంత ఉంచిన పూలమాలలను జగన్‌మోహన్ రెడ్డితో పాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజులకు వేశారు.

గర్భగుడి పక్కన ఉన్న ఉత్సవ మూర్తుల వద్ద జననేత పేరిట పూజలు చేసి, ఆయనను ఆశీర్వదించారు. ఆలయ విశేషాలను స్థానిక సిబ్బంది జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. అభివృద్ధి పనులను సిబ్బంది వివరించినపుడు సబ్బం హరి, కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ ఉత్తర రాజగోపుర నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమయ్యాయని ప్రశ్నించారు. సాంబశివరాజు హయాంలోనే ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి ఈ నిధులను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రామతీర్థం దర్శనానికి వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సుమారు అరగంట సేపు పూజలు జరిపించిన జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేంత వరకు వారు నిరీక్షించారు. వచ్చిన తర్వాత జననేతకు జేజేలు పలుకుతూ అభివాదం చేశారు.

వైఎస్ బతికుంటే సస్యశ్యామలం.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే సుజల స్రవంతి ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర జిల్లాలు సస్యశ్యామలమయ్యేవని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడా ప్రాజెక్టును ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై కడప ఎంపీ నిప్పులు చెరిగారు. మహానేత వైఎస్సార్ మహోన్నత ఆశయంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే...ప్రస్తుత పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. అనేక సంక్షేమ పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిపోతే బాగుంటుందని ప్రజలు భావిస్తుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలనుకుంటే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు. అవిశ్వాసం పెడితే జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తారోనన్న భయం పట్టుకుందన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న తాము స్వార్థపూరిత రాజకీయాలు చేయబోమని, సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల దృష్ట్యా అవిశ్వాసంపై నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ధాన్యం మద్దతు ధర, కొనుగోలు, విద్యార్థుల చదువులకు కేటాయించాల్సిన నిధులు...మహిళలకు చెల్లించాల్సిన పావలా వడ్డీపైన ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యవహరించాలని సూచించారు. అంతకీ స్పందించకపోతే అధికార పార్టీకి, ప్రతిపక్ష టీడీపీకి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు గద్దె దించుదామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలు ఎన్నికలొస్తే డిపాజిట్లు రాకుండా ఆ రెండు పార్టీలను బంగాళాఖాతంలోకి తోసేస్తారని జగన్‌మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈ సభలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, తాడ్డి వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సింగ్‌బాబు, గొర్లె వెంకటరమణ, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు, మొయిద ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను కలిసిన నాయకులు
 ఓదార్పుయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి భోగాపురంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బుధవారం ఉదయం పూసపాటిరేగ మండలంలో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ సమయంలో ఉదయం 7గంటలకు పలువురు సన్‌రే విలేజ్‌కు చేరుకున్నారు. ముందుగా ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందించారు.

తరువాత ఎంపీ సబ్బం హరి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి సాంబశివరాజు, కాకినాడ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మి దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నడిమల్లి శేషారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కలిశారు.

రాజమండ్రి మాజీ మేయరు ఎంఎస్ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మాజీ ఎంపీపీ బి.సుదర్శనరాజు, విశాఖకు చెందిన ఎంఎస్‌ఆర్ ఎస్టేట్స్ ఎండీ ఎం.శ్రీనివాసరాం, తాండవ చైర్మన్ పి.గణేష్, జామి మాజీ ఎంపీపీ కాకర్లపూడి సూరిబాబురాజు, కె.కె.వి.ఎన్.వర్మ, విశాఖపట్నం 17, 43వ వార్డుల సభ్యులు కె.అప్పారావు, హణుక్, విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ టెక్‌నో మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, ఎలమంచిలి నుంచి న్యాయవాది కె.జగదీష్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
జగన్‌తోనే వైఎస్ పాలన సాధ్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన స్వర్ణ యుగపు పాలన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని నెల్లిమర్ల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆ పార్టీ నాయకులు సింగుబాబు, గొర్లె వెంకటరమణ అన్నారు. మండలంలో మల్యాడ, సతివాడ, నెలిమర్లలో ఓదార్పు యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మంత్రిని చేశారని వారు గుర్తు చేశారు.

అటువంటి బొత్స వైఎస్‌ఆర్ తనయుడైన జగన్‌మోహనరెడ్డిని కడప ఉప ఎన్నికల్లో ఓడించడానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వెళ్లడం ఆయన కృతజ్ఞహీనమైన వ్యక్తో ఇదో నిదర్శనమని ఎద్దేవా చేశారు. బొత్స వెళ్ల బట్టే జమ్మలమడుగులో జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మోజార్టీ వచ్చిందని చెప్పారు. నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావూరి శంకరరావు, ఆదాడ మోహనరావు, జనాప్రసాద్ ప్రసంగించారు. మొయిద ఎంపీటీసీ సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాగా
కొమరాడ రూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగ వేస్తోంది. ప్రధానంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీ, సీపీఎం నాయకులు కూడా పార్టీలోకి చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఎంపీపీ తాడంగి దమయంతితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు బుధవారం వైఎస్సార్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో మలివిడత ఓదార్పుకు అడుగిడిన వేళ కాంగ్రెస్, టీడీపీ సీపీఎం నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు.
దివంగత నేత వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి స్థాపిం చిన చేసిన పార్టీని గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రజలు, గిరిజనులు ఆదరిస్తున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర రెడ్డి, ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ తాడంగి దమయంతి, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఇద్దరు ఇండిపెండెంట్లు, టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు చేరారు. మండలంలో 14 ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మండలంలో 27 పంచాయతీల్లో కాంగ్రెస్‌కు చెందిన17 మంది సర్పంచ్‌లు, సీపీఎంకు చెందిన ఆరుగురు సర్పంచ్ లు ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారు.

టీడీపీకి చెందిన నలుగురు సర్పంచ్‌ల్లో ఇప్పటికే ఒకరు చేరగా, మరో సర్పంచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ బౌల్డ్ చేసినట్లేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ మండలంతోపాటు కురుపాం నియోజకవర్గానికి చెందిన కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలసలు కూడా అదే బాటలో నడుస్తాయి. ఈ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగిడే నాటికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని ఆయా పార్టీ నాయకులే అంటున్నారు.
‘ఓదార్పుయాత్రకు తరలిరండి’
బొబ్బిలి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో ఈ నెల 27న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రకు తరలి రావాలని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరంచనున్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆయనతో పాటు తూముల రామసుధీర్ తదితరులు బుధవారం పరిశీ లించారు.

పట్టణంలో అమ్మిగారి కోనేటి గట్టు, పిరిడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాలను వారు పరిశీలించారు. పిరి డి, జగన్నాథపురం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రలో పంపాన శ్రీనివాసరావు, తేలు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో జగన్ మోహన్‌రెడ్డి అభిమానులు బర్ల వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో ఓదార్పుపై ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఐవీ రమణమూర్తి, ఐవీఆర్ ఆండాళ్ ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి ( అనంతపురం )

: రాష్ట్రం లేదా నియోజకవర్గాలు అభివృద్ధి చెం దాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చౌళూరు రామక్రిష్ణారెడ్డి పే ర్కొన్నారు. బుధవారం స్థానిక హస్నాబాద్‌లో టీడీపీకి చెందిన ఇలియా జ్, చాంద్‌బాషా, రెహమాన్, హుస్సేన్, రహంతుల్లా, కలీద్, ఆసీఫ్‌తోపా టు వంద మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామక్రిష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ కొనసాగిం చాలంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.

నియోజకవర్గ ఎమ్మె ల్యే, ము న్సిపల్ చైర్మన్ పురం అభివృద్ధిని విస్మరించారన్నారు. రాబోవు ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. హస్నాబాద్‌లో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని వాపోయా రు. మెరుగైన సౌకర్యాలు, మెరుగైన అభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ మహానేత హిందూపురం పట్టణానికి రూ.650 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య తీర్చారన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలోకి చేరామన్నారు. కార్యక్రమంలో అన్వర్, ముస్తాఫా, చోటు, ఆటో దాదు, బాబు, రెహమాన్, ఫయాజ్, కౌన్సిలర్ సమీవుల్లా, చాంద్‌బాషా, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌కు జై కొట్టిన అవనిగడ్డ పీఆర్పీ

అవనిగడ్డ (కృష్ణా), న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పీఆర్పీ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై అసంతృప్తికి గురైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి అవనిగడ్డలో సమావేశమయ్యారు. సీనియర్ నేత బోయిన వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 90శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 500మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ మనోభావాలను నిస్సంకోచంగా వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం తపిస్తున్న జగన్మోహనరెడ్డికి మద్దతుగా నిలవడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. మండల స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం వెలువరించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్ కార్యకర్తలకు తెలిపారు. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

జగన్‌కు న్యాయవాదుల అధ్యక్షుడి మద్దతు

విజయనగరం, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ సోదరుడు, జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రవికుమార్ బుధవారం జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. భోగాపురం వద్ద జగన్ బస చేసిన అతిథి గృహానికి ఆయన రాగా.. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆయన్ను కడప ఎంపీకి పరిచయం చేశారు.

భారీగా వలసలు: ఓదార్పు యాత్ర రెండో రోజైన బుధవారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వచ్చి జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొవ్వాడలో సర్పంచ్ పి.రామినాయుడు, ఉప సర్పంచ్ కొడ్ల పార్వతి ఆధ్వర్యంలో రెండు వేల మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సతివాడలో ఒమ్మి సర్పంచ్ అంబాళ్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 200 మంది పార్టీలో చేరారు.

అవిశ్వాసంపై బాబుకు జగన్ సవాల్


మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు,
ఫీజుల పథకం కోసం రూ. 6,800 కోట్లు,
పావలా వడ్డీకి రూ. 2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి
సర్కారు వాటిని తీర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాసానికి మేం మద్దతిస్తాం

నెల్లిమర్ల నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి:సం క్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇక ఎంత మాత్రం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతూ నోటీసులు ఇవ్వాలని అన్నారు. ‘చంద్రబాబు గారూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. నేనడుగుతున్నా.. మీకు నిజంగా పేద ప్రజలపై ప్రేమే ఉంటే.. ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి. రైతులకు మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాలని, పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ. 6,800 కోట్లు ఇవ్వాలని, అక్కా చెల్లెళ్ల మొహాల్లో చిరునవ్వు చూడ్డానికి అవసరమైన పావలా వడ్డీ పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. ప్రజల సంక్షేమం కోసం ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాస తీర్మానానికి అవసరమైతే మేం మద్దతు పలుకుతాం’ అని జగన్ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర రెండో రోజు బుధవారం ఆయన పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలో ఉణుకూరు అప్పారావు కుటుంబాన్ని ఓదార్చారు. మొయిద జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ను పంపించాలని వేడుకుంటున్నారు: ‘మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మహానేత బతికి ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అన్ని ప్రాజెక్టులూ పూర్తయ్యేవి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవి. ఇప్పుడు.. రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ పంపించు దేవుడా అని వేడుకునే పరిస్థితి వచ్చింది.

బాబుకు నిజంగా ప్రేమే ఉంటే: ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదల నడ్డి విరగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాంటి సర్కారును చొక్కా పట్టుకుని అడుగుతారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే.. ఆయన మాత్రం మొసలి కన్నీళ్లతోనే సరిపెడుతున్నారు. చంద్రబాబు గారూ.. రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్ట పోతున్నారు. మీకు వారిపై నిజంగా ప్రేమ ఉంటే.. మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కచ్చితంగా కేటాయించి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. గతేడాది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటులో ప్రభుత్వం రూ. 3,400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది పథకం అమలుకు మరో రూ. 3,400 కోట్లు అవసరం. రెండూ కలుపుకుంటే రూ. 6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభత్వం కేవలం మూడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. చంద్రబాబుగారూ విద్యార్థులపై మీకు నిజంగా ప్రేమ ఉంటే.. పేద విద్యార్థుల చదువు కోసం రూ. 6,800 కోట్లు కావాలని మీరు డిమాండ్ చేయండి! ప్రతి అక్కా, చెల్లి మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలి. ఈ పథకంలో గత ఏడాది రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు గారు మీరు డిమాండ్ చేయండి.. పావలా వడ్డీ పథకానికి రూ.రెండు వేల కోట్లు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని... ఈ డిమాండ్లతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి.. ప్రభుత్వం వీటిని నెరవేర్చిందా సరే.. లేనిపక్షంలో అవసరమైతే మీకు మేం మద్దతిస్తాం.

బాబుపై భయం లేదు: చంద్రబాబు రోడ్డెక్కి చేతగాని ప్రభుత్వమని మాట్లాడతారేగానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఎందుకంటే.. బాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయాయి. ఈ ప్రభుత్వం చంద్రబాబు అవిశ్వాసం పెడతారేమో.. అని భయపడటం లేదు. ఆయన అవిశ్వాసం పెడితే జగన్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో...ఏమో..! అని భయపడుతోంది. పేద ప్రజల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోక పోయినా, ప్రతిపక్షం పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.

అవిశ్వాసం పెడితే మద్దతు: జగన్

విజయనగరం: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రజలపై ప్రేమ ఉండి శాసనసభలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే, తాము కూడా మద్దతు పలుకుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఓదార్పు యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా మోయిదా జంక్షన్ లో రాత్రి 8 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు ప్రతిపేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం వారి గోడుని పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని విమర్శించారు. ఆ నాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణపాలన సాగుతున్న సమయంలో కేవలం 46 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. ఇప్పుడు జనం అందరూ కోరుతున్నా, టిడిపికి 90 మంది ఎమ్మెలు ఉన్నా అవిశ్వాసం తీర్మానం పెట్టడంలేదని అన్నారు. జనంపై ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. జగన్ కు మద్దతు పలికేవారందరూ ఆ తీర్మానానికి మద్దతుగా మద్దతుగా ఓటు వేస్తారని చెప్పారు.

సభకు జనం భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి పెన్మచ్చ సాంబశివరాజు, ఎంపి సబ్బం హరి ఆయన వెంట ఉన్నారు.