Pages

Wednesday, May 25, 2011

అవిశ్వాసంపై బాబుకు జగన్ సవాల్


మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు,
ఫీజుల పథకం కోసం రూ. 6,800 కోట్లు,
పావలా వడ్డీకి రూ. 2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి
సర్కారు వాటిని తీర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాసానికి మేం మద్దతిస్తాం

నెల్లిమర్ల నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి:సం క్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇక ఎంత మాత్రం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతూ నోటీసులు ఇవ్వాలని అన్నారు. ‘చంద్రబాబు గారూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. నేనడుగుతున్నా.. మీకు నిజంగా పేద ప్రజలపై ప్రేమే ఉంటే.. ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి. రైతులకు మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాలని, పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ. 6,800 కోట్లు ఇవ్వాలని, అక్కా చెల్లెళ్ల మొహాల్లో చిరునవ్వు చూడ్డానికి అవసరమైన పావలా వడ్డీ పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. ప్రజల సంక్షేమం కోసం ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందా సరే.. లేదంటే మీ అవిశ్వాస తీర్మానానికి అవసరమైతే మేం మద్దతు పలుకుతాం’ అని జగన్ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర రెండో రోజు బుధవారం ఆయన పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలో ఉణుకూరు అప్పారావు కుటుంబాన్ని ఓదార్చారు. మొయిద జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ను పంపించాలని వేడుకుంటున్నారు: ‘మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మహానేత బతికి ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అన్ని ప్రాజెక్టులూ పూర్తయ్యేవి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవి. ఇప్పుడు.. రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ పంపించు దేవుడా అని వేడుకునే పరిస్థితి వచ్చింది.

బాబుకు నిజంగా ప్రేమే ఉంటే: ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదల నడ్డి విరగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాంటి సర్కారును చొక్కా పట్టుకుని అడుగుతారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే.. ఆయన మాత్రం మొసలి కన్నీళ్లతోనే సరిపెడుతున్నారు. చంద్రబాబు గారూ.. రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్ట పోతున్నారు. మీకు వారిపై నిజంగా ప్రేమ ఉంటే.. మద్దతు ధర కోసం రూ. 2,000 కోట్లు కచ్చితంగా కేటాయించి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. గతేడాది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటులో ప్రభుత్వం రూ. 3,400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది పథకం అమలుకు మరో రూ. 3,400 కోట్లు అవసరం. రెండూ కలుపుకుంటే రూ. 6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభత్వం కేవలం మూడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. చంద్రబాబుగారూ విద్యార్థులపై మీకు నిజంగా ప్రేమ ఉంటే.. పేద విద్యార్థుల చదువు కోసం రూ. 6,800 కోట్లు కావాలని మీరు డిమాండ్ చేయండి! ప్రతి అక్కా, చెల్లి మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలి. ఈ పథకంలో గత ఏడాది రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు గారు మీరు డిమాండ్ చేయండి.. పావలా వడ్డీ పథకానికి రూ.రెండు వేల కోట్లు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని... ఈ డిమాండ్లతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వండి.. ప్రభుత్వం వీటిని నెరవేర్చిందా సరే.. లేనిపక్షంలో అవసరమైతే మీకు మేం మద్దతిస్తాం.

బాబుపై భయం లేదు: చంద్రబాబు రోడ్డెక్కి చేతగాని ప్రభుత్వమని మాట్లాడతారేగానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఎందుకంటే.. బాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయాయి. ఈ ప్రభుత్వం చంద్రబాబు అవిశ్వాసం పెడతారేమో.. అని భయపడటం లేదు. ఆయన అవిశ్వాసం పెడితే జగన్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో...ఏమో..! అని భయపడుతోంది. పేద ప్రజల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోక పోయినా, ప్రతిపక్షం పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.

No comments:

Post a Comment