Pages

Wednesday, June 1, 2011

రైతు వ్యతిరేక ప్రభుత్వమిది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
‘స్థానిక’ ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
ఈ నెల 15లోగా మండల, అసెంబ్లీ,
జిల్లా అడ్‌హాక్ కమిటీల నియామకం
15 నుంచి సభ్యత్వ నమోదు


హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు వ్యతిరేక సర్కారుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అన్నదాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబడుతూ.. ఈ సర్కారును కదిలించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టక తప్పదని చెప్పారు. బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన అధ్యక్షతన పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల సమావేశం జరిగింది. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఈ సమావేశం తీర్మానం చేసింది.

ముందుగా దివంగత నేత వైఎస్‌కు భేటీ నివాళులు అర్పించింది. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేసిన జగన్.. రాష్ట్రంలో రైతుల అధ్వాన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహానేత వైఎస్సార్ మరణించాక వరుసగా రెండు, మూడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. తాను ఇస్తానన్న సబ్సిడీలో పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేకపోయింది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంవల్ల మళ్లీ తాజా రుణాలు కూడా లభించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక రైతులు తాము వరి ధాన్యం పండించబోమని స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం విచారకరం.

ఇది ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేక పోయిందన్నారు. సుమారు 70 శాతం మంది ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. భేటీ అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులకు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఈ నెల 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఏదో ఒక జిల్లాలో ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.

అడ్‌హాక్ కమిటీల్లో అందరికీ స్థానం..

మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా అడ్‌హాక్ కమిటీలను ఈ నెల 15 లోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు అంబటి చెప్పారు. ‘ఆయా జిల్లాల అడ్‌హాక్ కన్వీనర్లు, ముఖ్య నేతలు, ఎన్నికల పరిశీలకులు సమష్టిగా చర్చించుకుని అడ్‌హాక్ కమిటీలోని సభ్యుల పేర్లను ఖరారు చేయాలని సూచించాం. అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా అన్ని సామాజిక వర్గాల వారినీ ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఇందులో స్థానం ఉంటుంది. ఈ కమిటీలను పార్టీ కేంద్ర పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) ఆమోదం మేరకు ప్రకటించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. కమిటీల నియామకం తర్వాత 15వ తేదీ నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇపుడున్న పార్టీల మాదిరిగా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను చేర్పించే విషయంలో వినూత్న పద్ధతిని అనుసరిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరతారు. రుసుం తీసుకుని, వారితో సంతకాలు చేయిస్తారు’ అని అంబటి వివరించారు.

ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి..

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలెప్పుడు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చినట్లు అంబటి తెలిపారు. అడ్‌హాక్ కన్వీనర్లు, ఎన్నికల పరిశీలకులు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని, ఇప్పటి నుంచే వారిని ఆ దిశగా నడిపించాలని కోరామని చెప్పారు. వివిధ అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది జూలై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశంలోనే వెల్లడిస్తామని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

అన్నదాతను ఆదుకోండి

ముఖ్యమంత్రికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం



13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరి శీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు జగన్
కనీస మద్దతు ధర ఇచ్చి 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి
ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ నుంచే
క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 200 పెంచాలి
ధాన్యం సేకరణలో పంజాబ్ విధానాన్ని అనుసరించాలి
2009-10కి సంబంధించిన వ్యవసాయ రుణాలపై
వడ్డీ భారం లేకుండా చూడాలని డిమాండ్
రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం తక్షణం చర్యలు
తీసుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడి
లేని పక్షంలో 13వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరిక
వినతి పత్రాన్ని సీఎంకు అందజేసిన పార్టీ ప్రతినిధులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కష్టాల సుడిలో చిక్కుకున్న అన్నదాతను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి, తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ తరహా విధానంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించాలన్నారు. అనూహ్యంగా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న మద్దతు ధర ను క్వింటాలుకు మరో రెండు వందల రూపాయలను ఈ సీజన్ నుంచే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని.. లేని పక్షంలో ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తానే స్వయంగా నిరసనలను నేతృత్వం వహిస్తానని చెప్పారు. అన్నదాతను ఆదుకునేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి పంపిన వినతిపత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం కిరణ్‌కు అందజేసింది.

‘రబీ పంటనే అమ్ముకోలేకపోతే అన్నదాతలు బ్యాంకుల రుణాలను ఎలా చెల్లిస్తారు? ఈ రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ కోసం రైతన్నకు కొత్త రుణాలను ఎవరిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి లేకుండా రైతులు ఖరీఫ్ పంట ఎలా వేయగలుగుతారు?’ అని సీఎంకు పంపిన వినతిపత్రంలో జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత విశ్వాసం కోల్పోతున్నాడని చెప్పారు. గతంలో ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని.. అయితే, ప్రస్తుత సంక్షోభానికి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ‘ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వ్యవసాయం చేస్తూ.. దేశ ఆహార భద్రతకు కొండంత అండగా నిలుస్తున్న అన్నదాతల జీవితాలతో ఆడుకోవడం తప్పుగా అనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చింది..

సీఎంతో భేటీ అనంతరం కొణతాల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు సరైన ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోతున్నారని, దీంతో ఎన్నడూ లేని విధంగా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని లెవీగా సేకరించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఆ ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం తరఫున సేకరించాలన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ‘దివంగత వై.ఎస్.హయాంలో రూ. 500 ఉన్న మద్దతు ధరను రూ. 1,000 వరకు తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడితే ఐకేపీ సంఘాలతో ధాన్యం సేకరించేలా చర్యలు చేపట్టి రైతులకు లాభం చేకూర్చేలా చూశారు. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించలేదు’ అని విమర్శించారు. పంట దిగుబడి ఎక్కువ వస్తే అందుకు అవసరమైన గోదాములు, గోనె సంచులను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ‘మహానేత వైఎస్సార్ ైరె తు సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. ఇప్పుడీ ప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవడం చూసి.. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులన్నింటినీ తాము ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఐ.రామకృష్ణంరాజు, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, పి.జనక్ ప్రసాద్, కుడిపూడి చిట్టబ్బాయ్, పోతల ప్రసాద్ తదితరులున్నారు.

ప్రధాన డిమాండ్లివీ..

ఠ రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్ల నిధులను కేటాయించాలి.
ఠ ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పంజాబ్ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను చేపట్టాలి. పంజాబ్‌లో పౌర సరఫరాల సంస్థ, సహకార సంస్థలు, ఆగ్రో పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ల ద్వారా రైతుల నుంచి నేరుగా 90 శాతం ధాన్యం సేకరిస్తున్నారు. అదే తరహాలో ఇక్కడా ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలి.
ఠ 2009 సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. రైతాంగానికి వంద శాతం ఇన్‌పుడ్ సబ్సిడీ ఇస్తామన్న మాటను తక్షణం నెరవేర్చాలి. అలాగే అవసరమైన చోట రుణాలను రీషెడ్యూలు చేయాలి. 2009-10 సంవత్సరానికి సంబంధించిన వ్యవ సాయ రుణాలపై వడ్డీ భారం లేకుండా చూడాలి.

ఠ ధాన్యం సేకరణతోపాటు నిల్వల కోసం రాష్ట్రంలో తక్షణం 40 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన గోడౌన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుని వీటిని అన్ని మండల కేంద్రాల్లో నిర్మించాలి. గోదాముల కొరత కారణంగా కూడా రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం తలచుకుంటే కేవలం రూ. 300 కోట్లతో ఆరు నెలల వ్యవధిలో మండల స్థాయిల్లో ఈ గోదాములను నిర్మించవచ్చు.

-కూలీల రేట్లతో పాటు సేద్యంలో అనూహ్యంగా పెరిగిన ఖర్చును దృష్టిలో ఉంచుకొని వరికి మద్దతు ధర ను క్వింటాలుకు మరో రూ. 200ను ఈ సీజన్ నుంచే పెంచాలి.
-కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వమే భరించాలి.

నమ్మకంతో బాధ్యతలు అప్పగించా: జగన్

హైదరాబాద్ : ‘‘మీ అందరి మీద ఎంతో నమ్మకంతో మీకు బాధ్యతలు అప్పగించాను. కష్టపడి పని చేయండి.మీరు పార్టీ తరపున చేయల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పార్టీ బాధ్యతలు నిర్వర్తించలేమని భావిస్తే ఇపుడే చెప్పండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందాం. అంతే గానీ బాధ్యతలు స్వీకరించి పార్టీ పని చేయకుండా ఉండొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు విస్పష్టంగా తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకులు, కేంద్ర పాలక మండలి సభ్యులను ఉద్దేశించి రెండో రోజు ప్రసంగిస్తూ ఎవరైనా పార్టీ చెప్పిన పనులు నిర్వహించలేమని భావిస్తే చేతులెత్తాలని కోరారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ఇపుడు చేస్తామని చెప్పి మధ్యలో మానుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, కనుక ముందే చెప్పాలని ఆయన కోరారు. పార్టీ నేతలను ప్రోత్సాహ పరుస్తూనే సభ్యత్వం, కమిటీల ఏర్పాటు వంటి విషయాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సున్నితంగా అన్నారు. అడ్‌హాక్ కన్వీనర్లకు పార్టీ వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉంటుందనీ అయితే అందరికీ ఆమోదయోగ్యంగా పనులు చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందనీ జగన్ అన్నారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా అడ్‌హాక్ కమిటీల్లో ఉండాల్సిన సభ్యుల కనీస సంఖ్య 6 లేదా 7 మంది ఉండాలనీ, గరిష్ట సంఖ్య 10 మంది ఉండాలనీ ఆయన సూచించారు. ఈ కమిటీల్లో సాధ్యమైనంత వరకూ అన్ని వర్గాలూ ఉండేలా చూడాలని కూడా ఆయన కోరారు. సభ్యత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల మాదిరిగా బోగస్‌వి ఉండరాదని ఆయన హెచ్చరించారు. కచ్చితంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం చే ర్పించాలనీ సభ్యత్వ రుసుము వారి వద్ద నుంచే వసూలు చేసి వారి సంతకాలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలా కాకుండా నాయకులు మొత్తం డబ్బులు తామే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చెల్లిస్తామంటే అంగీకరించబోమనీ ఆయన అన్నారు. సభ్యత్వ రుసుము వారి వద్ద తీసుకున్నపుడే పార్టీలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయనీ, వాటిని పార్టీ పటిష్టత కోసం మలుచుకోవాలని ఆయన పార్టీ నేతలతో అన్నారు.

తెలంగాణపై విస్పష్టమైన విధానం

తెలంగాణ విషయంలో పార్టీకి స్పష్టమైన వైఖరి ఉండాలని ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లా కన్వీనర్లు పి.జనక్ ప్రసాద్, కె.కె.మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి అధ్యక్షుడు జగన్‌కు సూచించారు. జనక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారనీ వారందరూ మన పట్ల సానుకూలంగా ఉన్నారనీ అన్నారు. వారి విశ్వాసం మరింతగా చూరగొనాలంటే తెలంగాణపై ఒక విధానం ప్రకటించడంతో పాటుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. అందుకు జగన్ స్పందిస్తూ కచ్చితంగా ఇడుపులపాయలో జరిగే ప్లీనరీలో వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు.