Pages

Wednesday, June 1, 2011

అన్నదాతను ఆదుకోండి

ముఖ్యమంత్రికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం



13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరి శీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు జగన్
కనీస మద్దతు ధర ఇచ్చి 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి
ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ నుంచే
క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 200 పెంచాలి
ధాన్యం సేకరణలో పంజాబ్ విధానాన్ని అనుసరించాలి
2009-10కి సంబంధించిన వ్యవసాయ రుణాలపై
వడ్డీ భారం లేకుండా చూడాలని డిమాండ్
రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం తక్షణం చర్యలు
తీసుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడి
లేని పక్షంలో 13వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరిక
వినతి పత్రాన్ని సీఎంకు అందజేసిన పార్టీ ప్రతినిధులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కష్టాల సుడిలో చిక్కుకున్న అన్నదాతను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి, తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ తరహా విధానంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించాలన్నారు. అనూహ్యంగా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న మద్దతు ధర ను క్వింటాలుకు మరో రెండు వందల రూపాయలను ఈ సీజన్ నుంచే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని.. లేని పక్షంలో ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తానే స్వయంగా నిరసనలను నేతృత్వం వహిస్తానని చెప్పారు. అన్నదాతను ఆదుకునేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి పంపిన వినతిపత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం కిరణ్‌కు అందజేసింది.

‘రబీ పంటనే అమ్ముకోలేకపోతే అన్నదాతలు బ్యాంకుల రుణాలను ఎలా చెల్లిస్తారు? ఈ రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ కోసం రైతన్నకు కొత్త రుణాలను ఎవరిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి లేకుండా రైతులు ఖరీఫ్ పంట ఎలా వేయగలుగుతారు?’ అని సీఎంకు పంపిన వినతిపత్రంలో జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో అన్నదాత విశ్వాసం కోల్పోతున్నాడని చెప్పారు. గతంలో ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని.. అయితే, ప్రస్తుత సంక్షోభానికి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ‘ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వ్యవసాయం చేస్తూ.. దేశ ఆహార భద్రతకు కొండంత అండగా నిలుస్తున్న అన్నదాతల జీవితాలతో ఆడుకోవడం తప్పుగా అనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చింది..

సీఎంతో భేటీ అనంతరం కొణతాల విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు సరైన ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోతున్నారని, దీంతో ఎన్నడూ లేని విధంగా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని లెవీగా సేకరించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఆ ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం తరఫున సేకరించాలన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ‘దివంగత వై.ఎస్.హయాంలో రూ. 500 ఉన్న మద్దతు ధరను రూ. 1,000 వరకు తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడితే ఐకేపీ సంఘాలతో ధాన్యం సేకరించేలా చర్యలు చేపట్టి రైతులకు లాభం చేకూర్చేలా చూశారు. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించలేదు’ అని విమర్శించారు. పంట దిగుబడి ఎక్కువ వస్తే అందుకు అవసరమైన గోదాములు, గోనె సంచులను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ‘మహానేత వైఎస్సార్ ైరె తు సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. ఇప్పుడీ ప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవడం చూసి.. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులన్నింటినీ తాము ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఐ.రామకృష్ణంరాజు, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, పి.జనక్ ప్రసాద్, కుడిపూడి చిట్టబ్బాయ్, పోతల ప్రసాద్ తదితరులున్నారు.

ప్రధాన డిమాండ్లివీ..

ఠ రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2,000 కోట్ల నిధులను కేటాయించాలి.
ఠ ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పంజాబ్ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను చేపట్టాలి. పంజాబ్‌లో పౌర సరఫరాల సంస్థ, సహకార సంస్థలు, ఆగ్రో పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ల ద్వారా రైతుల నుంచి నేరుగా 90 శాతం ధాన్యం సేకరిస్తున్నారు. అదే తరహాలో ఇక్కడా ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలి.
ఠ 2009 సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. రైతాంగానికి వంద శాతం ఇన్‌పుడ్ సబ్సిడీ ఇస్తామన్న మాటను తక్షణం నెరవేర్చాలి. అలాగే అవసరమైన చోట రుణాలను రీషెడ్యూలు చేయాలి. 2009-10 సంవత్సరానికి సంబంధించిన వ్యవ సాయ రుణాలపై వడ్డీ భారం లేకుండా చూడాలి.

ఠ ధాన్యం సేకరణతోపాటు నిల్వల కోసం రాష్ట్రంలో తక్షణం 40 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన గోడౌన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుని వీటిని అన్ని మండల కేంద్రాల్లో నిర్మించాలి. గోదాముల కొరత కారణంగా కూడా రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం తలచుకుంటే కేవలం రూ. 300 కోట్లతో ఆరు నెలల వ్యవధిలో మండల స్థాయిల్లో ఈ గోదాములను నిర్మించవచ్చు.

-కూలీల రేట్లతో పాటు సేద్యంలో అనూహ్యంగా పెరిగిన ఖర్చును దృష్టిలో ఉంచుకొని వరికి మద్దతు ధర ను క్వింటాలుకు మరో రూ. 200ను ఈ సీజన్ నుంచే పెంచాలి.
-కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వమే భరించాలి.

No comments:

Post a Comment