Pages

Wednesday, June 1, 2011

రైతు వ్యతిరేక ప్రభుత్వమిది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల భేటీలో తీర్మానం
ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
‘స్థానిక’ ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
ఈ నెల 15లోగా మండల, అసెంబ్లీ,
జిల్లా అడ్‌హాక్ కమిటీల నియామకం
15 నుంచి సభ్యత్వ నమోదు


హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రైతు పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు వ్యతిరేక సర్కారుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అన్నదాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబడుతూ.. ఈ సర్కారును కదిలించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టక తప్పదని చెప్పారు. బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన అధ్యక్షతన పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకుల సమావేశం జరిగింది. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఈ సమావేశం తీర్మానం చేసింది.

ముందుగా దివంగత నేత వైఎస్‌కు భేటీ నివాళులు అర్పించింది. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేసిన జగన్.. రాష్ట్రంలో రైతుల అధ్వాన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహానేత వైఎస్సార్ మరణించాక వరుసగా రెండు, మూడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. తాను ఇస్తానన్న సబ్సిడీలో పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేకపోయింది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంవల్ల మళ్లీ తాజా రుణాలు కూడా లభించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక రైతులు తాము వరి ధాన్యం పండించబోమని స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం విచారకరం.

ఇది ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేక పోయిందన్నారు. సుమారు 70 శాతం మంది ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. భేటీ అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులకు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఈ నెల 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఏదో ఒక జిల్లాలో ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.

అడ్‌హాక్ కమిటీల్లో అందరికీ స్థానం..

మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా అడ్‌హాక్ కమిటీలను ఈ నెల 15 లోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు అంబటి చెప్పారు. ‘ఆయా జిల్లాల అడ్‌హాక్ కన్వీనర్లు, ముఖ్య నేతలు, ఎన్నికల పరిశీలకులు సమష్టిగా చర్చించుకుని అడ్‌హాక్ కమిటీలోని సభ్యుల పేర్లను ఖరారు చేయాలని సూచించాం. అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా అన్ని సామాజిక వర్గాల వారినీ ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఇందులో స్థానం ఉంటుంది. ఈ కమిటీలను పార్టీ కేంద్ర పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) ఆమోదం మేరకు ప్రకటించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. కమిటీల నియామకం తర్వాత 15వ తేదీ నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇపుడున్న పార్టీల మాదిరిగా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను చేర్పించే విషయంలో వినూత్న పద్ధతిని అనుసరిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరతారు. రుసుం తీసుకుని, వారితో సంతకాలు చేయిస్తారు’ అని అంబటి వివరించారు.

ఎన్నికలెప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి..

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలెప్పుడు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చినట్లు అంబటి తెలిపారు. అడ్‌హాక్ కన్వీనర్లు, ఎన్నికల పరిశీలకులు పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని, ఇప్పటి నుంచే వారిని ఆ దిశగా నడిపించాలని కోరామని చెప్పారు. వివిధ అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది జూలై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశంలోనే వెల్లడిస్తామని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

No comments:

Post a Comment