Pages

Tuesday, May 24, 2011

మాట తప్పితే మన్నించరు:జగన్

విజయనగరం, న్యూస్‌లైన్: మాట మీద నిల బడకుండా మోసగించే నాయకులను ప్రజలు క్షమించరని, వారిని ఇంటికి సాగనంపుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రావాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చుతానని మహానేత కన్నుమూసిన ప్రదేశంలోనే తాను మాటిచ్చానని గుర్తు చేశారు. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే ఇటీవల జరిగిన కడప, పులివెందుల ఎన్నికలు వచ్చేవే కాదని అన్నారు. 

రాజకీయ నాయకుడు అంటే మాటమీద నిలబడే నాయకుడు కావాలనే తీర్పు కడప ప్రజల నుంచి వచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాటలను గాలికి వదిలేసే నాయకులను ఎన్నికల సమయంలో ఇంటికి సాగనంపుతామని ఈ తీర్పు ద్వారా ప్రజలు చెప్పారని ఆయన అన్నారు. ఇక్కడ ఏ గుండె చప్పుడు విన్నా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తున్నారని, ఇంత పెద్ద కుటుంబం ఉందన్నసంతృప్తి తనకు చాలని అన్నారు. విద్య, వైద్యం కోసం మహానేత పెట్టిన పథకాల ద్వారాఉన్నత స్థానాలకు చేరుకొని, తమ కుటుంబాలను బాగుపెడదామని భావించే ప్రతి విద్యార్థి చిరునవ్వులో వైఎస్‌ఆర్ కనిపిస్తూనే ఉంటారని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కడప ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ఈ జిల్లాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తొలివిడత ఓదార్పు కంటే అధికంగా ప్రజలు ఆదరాభిమానాలు చూపడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

No comments:

Post a Comment