Pages

Tuesday, May 24, 2011

పల్లెలన్నీ మల్లెలై...

* కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం
* జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభం
* వాడవాడలా అపూర్వ ఆదరణ
* కదలివచ్చిన పల్లెలు
* ఇతర పార్టీల నుంచి వలసలు
* భారీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరికలు


పాపం సూర్యుడు... అభిమానులకు పరీక్ష పెట్టబోయాడు. ‘చూద్దాం...వీరి ఓపికెంతో’ అన్నట్టుగా నిన్నామొన్నటికంటే ఎండ తీవ్రత పెంచాడు. కానీ జననేతపై ప్రజలకు గల అభిమానం ముందు ఆయన గారి ట్రిక్కులు పని చేయలేదు. ఎండ మండుతున్నా లెక్క చేయకుండా అభిమానులు, కార్యకర్తలు ఉదయం నుంచీ వేచి చూశారు. తమ అభిమాన నాయకుడు జిల్లాలో ఎప్పుడు అడుగు పెడతారా? అని ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జిల్లాకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. ఆయన పై పూలవాన కురిపించారు. 

విజయనగరం, న్యూస్‌లైన్ : విజయుడై వచ్చిన జననేత కోసం పల్లెలన్నీ బారులు తీరాయి. రెండో విడత ఓదార్పు కోసం మంగళవారం జిల్లాకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. రాజపులోవ జంక్షన్ నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. తొలుత మహారాజుపేట గ్రామం వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. అక్కడినుంచి గుడివాడ గ్రామానికి వెళ్లి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఆ తర్వాత చెరకుపల్లి గ్రామానికి చేరుకోగానే స్థానికులు డప్పులతో స్వాగతం పలికి, జననేతపై పూలవర్షం కురిపిం చారు. అక్కడి నుంచి లింగాలవలస వెళ్లారు. స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బోను రమణ, రామినాయుడుల ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పోలుపల్లి గ్రామానికి చేరుకోగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఎదురొచ్చి యువనేతను వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కడప ఎంపీ ఆవిష్కరించారు. రావాడ గ్రామంలోని గొల్లలపేటలో వై.ఎస్.ఆర్. మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి గూడెపువలస వస్తుండగా మార్గమధ్యలోని రావివలస గ్రామ ప్రజలు ఎదురొచ్చి, జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. గూడెపువలసలో రాజకీయాలకు అతీతంగా, చిన్న, పెద్ద తేడా లేకుండా జననేతను చూసేందుకు తరలివచ్చారు. దివంగత సీఎం వైఎస్ విగ్రహాన్ని యువనేత ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశానికి చెందిన భోగాపురం జెడ్పీటీసీ సభ్యురాలు కొండపు ఆదిలక్ష్మి, సర్పంచ్ దారపు లక్ష్మణరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఇంటి పైడయ్య, మాజీ సర్పంచ్ కొండపు శ్రీనివాసరెడ్డి తదితరులు యువనేత సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరిన జెడ్పీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ కొద్దిసేపు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి అక్కడికి వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం రెడ్డికంచేరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు సుమారు వందమంది, చేపలకంచేరుకు చెందిన 400 మంది వివిధ పార్టీల నుంచి వచ్చి, జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఓదార్పుయాత్ర సైడ్‌లైట్స్
ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెదతాడివాడ గ్రామానికి మంగళవారం వచ్చారు. ఆయన రాకతో గ్రామస్థులు పులకించిపోయారు. ఘన స్వాగతం పలికారు. తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. 

*డెంకాడ మండలం పెదతాడివాడలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినంత సమయం అభిమానులు బాణాసంచా కాల్చారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. 

*పలువురు యువకులు జగన్‌మోహన్‌రెడ్డి తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. 

*జగన్‌మోహన్‌రెడ్డి గ్రామానికి వచ్చే సమయంలో డప్పుల వాయిద్యాలతో సందడి వాతావరణం నెలకొంది.

*జగన్ కాన్వాయ్ వెనుక గ్రామస్థులంతా పరుగులు తీశారు. 

*జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించినపుడు అభిమానులు జయజయ నినాదాలు చేశారు. 

*జగన్‌మోహన్‌రెడ్డి రాకతో గ్రామమంతా కిక్కిరిసిపోయింది.

No comments:

Post a Comment