Pages

Tuesday, May 31, 2011

మనసు విప్పి మాట్లాడండి

పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే.. నాయకులు ప్రతి ఒక్కరూ మనసు విప్పి తమ అభిప్రాయాలను వెల్లడించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి నాయకుడు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడే అన్ని విషయాల్లోనూ స్పష్టత ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పోయిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్రపాలక మండలి(సీజీసీ) తొలి సమావేశం మంగళవారమిక్కడ జరిగింది. ఉదయం 11 నుంచి నాలుగు గంటల పాటు పార్టీ సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశం చర్చించింది. అవిశ్వాస తీర్మానం, రైతుల సమస్యలు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలులాంటి అనేక కీలక అంశాలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రతి ఒక్కరూ ఆయా అంశాలను ప్రస్తావించి పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

సభ్యత్వ రుసుం పది రూపాయలు: పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు, నియోజకవర్గ ఇన్‌చార్జుల నియామకంపై సమావేశంలో చర్చించారు. సాధారణ సభ్యత్వంగా 10 రూపాయల రుసుము, క్రియాశీలక సభ్యులకు వంద రూపాయల రుసుముగా సమావేశంలో నిర్ణయించారు. అయితే మహిళలకు సాధారణ సభ్యత్వం 5 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం రూ. 50గా నిర్ధారించారు. సభ్యత్వ నమోదు ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై చర్చించడానికి బుధవారం జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, జిల్లా ఇంచార్జులతో సమావేశం నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment