Pages

Tuesday, June 14, 2011

అన్నదాత కన్నీటికి జవాబు ఏది?

{పతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి
‘మద్దతు’ లేక 40 లక్షల టన్నుల రబీ ధాన్యం ఇంకా పొలాల్లోనే ఉంది
రైతు నానా కష్టాలు పడుతున్నాడు
ఇలాగైతే అతడెలా బతకాలి? ఖరీఫ్‌కు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి?
సర్కారును నిలదీయాల్సిన తెలుగుదేశం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడింది
ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ పదవికి పోటీ పెట్టి రాజకీయం చేసింది
అసెంబ్లీలో స్పీకర్ పోటీపైనే మాట్లాడిందిగానీ.. రైతుల సమస్యల ప్రస్తావన లేదు

చిత్తూరు, న్యూస్‌లైన్: సాగు కోసం రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చిత్తూరు ‘సాగు పోరు’లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఏటా సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుంటే.. కనీస మద్దతు ధర అనే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే.. అన్నదాత ఎలా బతకగలడని ప్రశ్నించారు.

రైతన్నల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సాగు పోరు’ పేరుతో సోమవారం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించగా.. రైతన్నలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించని తెలంగాణ జిల్లాల్లో సైతం ధర్నాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ‘సాగు పోరు’ ధర్నాలో పాల్గొన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రైతన్నల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వానికి చూపడానికే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టంచేశారు. చెరుకు, మామిడి, పత్తి, వరి, మల్బరీ.. ఇలా అన్ని పంటల రైతులూ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నారంటూ వారి కష్టాలను ఆయన వివరించారు. రైతు మోములో చిరునవ్వు చెరిపేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగుచేయడంకన్నా.. ఉరే మేలన్న భావనలో రైతులు ఉన్నారన్నారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

చెరుకు, మామిడి రైతుకు దిక్కేది?

చైతన్య యాత్రల పేరుతో రైతులకు కౌన్సెలింగ్ చేయాలంటున్న రాష్ట్ర ప్రభుత్వానికే కౌన్సెలింగ్ అవసరం. వారి కళ్లకు రైతుల కష్టాలు కనబడ్డం లేదు. రైతుల అవస్థలను ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకే వారి సొంత జిల్లా అయిన చిత్తూరులో ధర్నాలో నేను పాల్గొంటున్నాను. వారిద్దరినీ నేను ప్రశ్నిస్తున్నా... రాష్ట్రం దాకా ఎందుకు ఈ జిల్లాలో చెరుకు రైతులు పడుతున్న కష్టాలు మీకు కనబడ్డం లేదా? చెరుకు రైతుకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన బకాయిలు కేవలం ఈ జిల్లాలోనే రూ. 16 కోట్లు ఉంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా? చెరకు క్రషింగ్ ఎప్పుడో ఏప్రిల్‌లో మొదలైతే.. ఇప్పటికీ కనీస మద్దతు ధర ఎంతో చెప్పలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మామిడి రైతు సంగతి చూస్తే.. క్వింటాలు 20 వేలు పలుకుతున్న రోజులు చూశాం. కానీ ఇప్పుడు క్వింటాలురూ. 4 వేలు కూడా రాని పరిస్థితిలో రైతు అష్టకష్టాలు పడుతున్నాడు.

బీటీ కంపెనీలతో సర్కారు లాలూచీ

బీటీ పత్తి విత్తనాలను తీసుకుంటే.. రాష్ట్రంలో 98 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, 47 లక్షల ప్యాకెట్ల బీటీ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్యాకెట్ రేటు రూ. 1,800 ఉంటే.. సంబంధిత కంపెనీలతో కొట్లాడి ఆ ధరను రూ. 750కు తగ్గించేలా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీలతో లాలూచీ పడిపోయింది. అదే ప్యాకెట్‌ను రూ. 750కు మరో రూ. 180 అదనంగా చేర్చి కంపెనీలు విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మల్బరీ సాగు గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వేళ కేజీ పట్టు గూళ్లు రూ. 300, రూ. 400 ఉంటే.. ఈ రోజు అవి రూ. 175కే పడిపోయినా.. వారి కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడ్డం లేదు. వేరు శెనగ రైతు దుస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

ఇలాగైతే రెతైలా బతకాలి?

విత్తనాల దగ్గర్నుంచి ఎరువుల దాకా.. ఎరువుల దగ్గర్నుంచి డీజిల్ దాకా రైతు పండిస్తున్న పంట మీద ప్రతి ఏడాదీ పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 60 శాతం పెట్టుబడి పెరిగింది.. మరోవైపు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలన్న బాధ్యతనే మరిచి ప్రవర్తిస్తోంది. తాను పండించిన పంటకు కనీస మద్దతు ధరే రాకపోతే.. ఆ రైతు ఎలా బతకగలడని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.

ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలి?

మొన్న రబీలో పండించిన ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో.. రైతు దాన్ని తక్కువ రేటుకు అమ్ముకోలేక, అమ్ముకుందామన్నా గోదాముల్లో స్థలం లేక, కొనే దిక్కు లేకపోవడంతో.. ఇలా దాదాపుగా 40 లక్షల టన్నుల దాకా ధాన్యం పొలాల్లోనే మిగిలిపోయింది. రబీలో పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. ఈ రైతు సోదరుడు ఖరీఫ్‌లో పంటకు ఎక్కడి నుంచి పెట్టుబడి తెస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడి ముఖాన, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు చూడాలన్న ఆలోచనను పక్కన పెట్టింది. ఇలా పక్కనబెట్టిన ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించాలని నేను ప్రశ్నిస్తున్నా?

అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు?

కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని రైతు సమస్యలను గాలికొదిలేశాయి. రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనపై ఆనాడు చంద్రబాబు అసెంబ్లీలో 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం ప్రతిపాదించారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు 90 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా అసెంబ్లీలో అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదు? నలభయ్యేళ్ల చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా స్పీకర్ పదవికి పోటీ పెట్టని సంప్రదాయం మన రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఇటీవల స్పీకర్ పదవికి టీడీపీ పోటీ పెట్టి రాజకీయం చేసింది. రాజకీయం చేసి అసెంబ్లీలో ఆ స్పీకర్ ఎన్నికపైనే మాట్లాడిందికానీ.. రైతు సమస్యలపై ఒక్క మాటా మాట్లాడలేదు. మీ రాజకీయాలను దేవుడు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో మీ రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా దక్కవు. కుమ్మక్కయిన ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పేదవాని కన్నీటి బొట్లే సమాధానం చెబుతాయి. కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరులో తాము పడుతున్న కష్టాలను చెప్పుకోడానికి ఇంత మంది రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి తరలివచ్చారంటే.. వారిద్దరికీ ఇప్పటికైనా సిగ్గు రావాలని, బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రైతులను ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.

No comments:

Post a Comment