Pages

Monday, May 16, 2011

రైతు పోరు, జనహోరు

రెండో రోజూ ‘రైతు దీక్ష’కు పోటెత్తిన అన్నదాతలు
వినతిపత్రాలిచ్చి తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
జగన్ వెంటే నడుస్తానన్న మంత్రి ధర్మాన సోదరుడు, నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్
నేడు 12 గంటలకు దీక్ష విరమణ

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘బాబూ.. కాస్త దారిస్తారా..? జగన్ బాబును కలవాలి. ఆ మా రాజుకు ఈ కాగితం ఇచ్చెల్తా..! ఇంతమంది జనంలో కూడా ఎలాగోలా ఇక్కడ్దాక వచ్చా.. ఇంక నడవలేను సామి. కాస్త, ఆ బాబు దగ్గర్కి తీసుకెళ్లండయ్యా..’ అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వృద్ధ రైతు పేరం ముసలయ్య ఎట్టకేలకు జగన్ దగ్గరకు చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు ముసలయ్య మూడెకరాల పంటను నష్టపోయాడు. సర్కారు నుంచి ఎలాంటి సాయం లేని నేపథ్యంలో జగన్‌కు తన ఆవేదనను తెలియచేసేందుకు అతడు దీక్షకు వచ్చాడు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రమిచ్చాడు.

ఇలాంటి వృద్ధ, యువ, మహిళా రైతులు గుంటూరులో సోమవారం రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చారు. జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కాకపోయినా.. జగన్‌కు తమ సమస్యలు చెప్పుకొంటే వాటి పరిష్కారానికి ఆయన తమ తరఫున పోరాడతారన్న నమ్మకమే 70 ఏళ్ల వయసున్న వారిని సైతం ‘రైతు దీక్ష’కు లాక్కొచ్చింది. 48 గంటల రైతు దీక్షలో రెండోరోజైన సోమవారమిలా రైతులు, అభిమానులు, మద్దతు తెలిపేవారితో దీక్షా ప్రాంగణం పోటెత్తింది. రైతులు వ్యవసాయ పరిస్థితుల్ని, నష్టపోయిన తీరును.. తమను పట్టించుకోని అధికారుల వైఖరిపై జగన్‌కు వినతిపత్రాలు అందించారు. మహిళలు సైతం పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. పావలావడ్డీ, అభయహస్తం, రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను తమ అభిమాన నేత జగన్‌కు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్‌ను కలిసేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ కోసం నేనున్నాంటూ ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.
అదే ఓర్పు.. అదే చిరునవ్వు: ఆదివారం మధ్యాహ్నం నుంచీ తిండీ తిప్పలు లేకున్నా.. కరచాలనానికి జనం పోటెత్తుతున్నా.. జగన్ పెదాలపై చిరునవ్వు చెరగలేదు.. తనతో మాట్లాడ్డానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. క్యూలో వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ.. వారు చెప్పుకునే సమస్యల్ని సావధానంగా విన్నారు. అందరు రాజకీయ నేతల్లా కాకుండా.. వినతిపత్రాల్ని ఆయన చదువుతూ ఉండటం అభిమానుల్ని సంతృప్తిపరిచిన అంశమని చెప్పాలి. రైతన్నల చేతుల్లో చేయి కలిపి నేనున్నానంటూ భరోసానివ్వడం వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కదిలిన మహిళా లోకం: ఎర్రని సూరీడు అగ్నిగోళంలా మండుతూ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరినా లెక్కచేయక మహిళలు వడివడిగా వైఎస్సార్ రైతు ప్రాంగణానికి చేరుకున్నారు. వారు వేల సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల ఆకాంక్షను నెరవేర్చారు. ఓవైపు వేదికపై ప్రజా కళాకారులు పాటలు ఆలపిస్తుండగా, క్యూల్లో నిల్చొన్న రైతులు, అభిమానులు కూడా వారికి వంతపాడుతూ జేజేలు పలికారు.

రహదారులన్నీ గుంటూరు వైపే: సోమవారం రాష్ట్ర రహదారులన్నీ గుంటూరువైపే మళ్లాయి. కృష్ణా, ప్రకాశం, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి తరలి వచ్చారు. వీరుకాక ఖమ్మం, ఆదిలాబాద్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.


ప్రజాప్రతినిధుల హాజరు: రెండో రోజు దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధుల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోష్(రామచంద్రపురం), కొండా సురేఖ (పరకాల), ఎమ్మెల్యేలు తె ల్లం బాలరాజు(పోలవరం), కొర్ల భారతి(టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కె.శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), అమర్‌నాథరెడ్డి(రాజంపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బాబూరావు (పాయకరావుపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకాశేషుబాబు తదితరులున్నారు.

మిర్చి రైతులను ఆదుకోండి..
ఇన్‌చార్జి కలెక్టర్‌కు జగన్ ఫోన్
గుంటూరు, న్యూస్‌లైన్: ‘మిర్చి రైతుల్ని ఆదుకోండి.. అప్పులు చేసి పండించిన పంటను ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ధర సంగతి ఎలా ఉన్నా ఒక్క కాయ కూడా మిగలకుండా మొత్తం బూడిదైంది. గుంటూరులో వరుసగా కోల్డ్ స్టోరేజీలు తగులబడటంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతీ రైతుకు పారదర్శకంగా పరిహారం అందించాలి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ను కోరారు. ఆదివారం రాత్రి గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంలో ఉన్న వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నికి ఆహుతై వందలాదిమంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులు కలిసి న్యాయం చేయాలంటూ విన్నవించారు. తక్షణమే స్పందించిన జగన్.. అప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. నష్టపోయిన ప్రతి రైతును రికార్డుల ఆధారంగా గుర్తించి పరిహారం తక్షణమే అందించాలని, జాప్యం జరిగినా, రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తానని చెప్పారు. కాగా మిర్చి రైతులకు అండగా వైఎస్ జగన్ ఉంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. జేసీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సారాంశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రైతులకు వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే మళ్ళీ మళ్ళీ జగన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని చెప్పారు.

నేడు 12 గంటలకు దీక్ష విరమణ
వైఎస్ జగన్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. దీక్ష విరమణకు ముందు జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.







No comments:

Post a Comment